కోటి పుణ్యాల‌కు సాటి వైకుంఠ ఏకాద‌శి

0
62

వైకుంఠ ఏకాద‌శి! కోటి పుణ్యాల‌కు సాటి. మార్గ‌శిర లేదా పుష్య మాసంలో వ‌చ్చే పుణ్య‌తిథి ఇది. మ‌రోలా చెప్పాలంటే సూర్య‌ భ‌గ‌వానుడు ధ‌నూరాశి నుంచి మ‌క‌ర రాశిలోకి ప్ర‌వేశించే మ‌ధ్య కాలంలో వ‌చ్చే శుద్ధ ఏకాద‌శే వైకుంఠ ఏకాద‌శి. ఈ రోజును … ముక్కోటి ఏకాద‌శి లేదా మోక్ష‌ద ఏకాద‌శి అని కూడా పిలుస్తారు. మూడు కోట్ల మంది దేవ‌త‌లు శ్రీ మ‌హావిష్ణువును సేవించుకునే దివ్య‌మైన రోజు కాబ‌ట్టే ఇది ముక్కోటి ఏకాద‌శిగా ప్రాశ‌స్త్యం పొందింది. భ‌క్తుల పాపాల‌ను హ‌రించి మోక్షాన్ని ప్ర‌సాదించే రోజు అయినందున మోక్ష‌ద ఏకాద‌శిగా మారింది.

ప‌ర‌మాత్ముడు ఆషాఢ శుద్ధ ఏకాద‌శి రోజున యోగ‌నిద్ర‌లోకి వెళ్తాడు. దాదాపు 4 నెల‌లు అదే స్థితిలో ఉంటాడు. కార్తీక మాసంలో ప‌రివ‌ర్త‌న చెందుతాడు. మార్గ‌శిరంలో యోగ‌నిద్ర‌లో నుంచి మేల్కొంటాడు. ఈ ఉత్తాన స్థితి … సంక్ర‌మ‌ణాన్ని బ‌ట్టి ఒక్కోసారి పుష్య‌మాసంలో కూడా సంభ‌విస్తుంది. ఆ స‌మ‌యంలో అత్యంత ప్ర‌శాంతంగా క‌నిపించే శ్రీమ‌న్నారాయ‌ణుడి క‌రుణాక‌టాక్షాలు త‌మ‌పై ప్ర‌స‌రించాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. అందుకే ముక్కోటి దేవ‌త‌లు వైకుంఠానికి వెళ్లి స్వామిని సేవిస్తారు. ఉత్త‌ర ద్వారం ద్వారా వైకుంఠ‌నాథుణ్ని ద‌ర్శించుకుని త‌రిస్తారు.

కుంఠ‌ము లేనిదే వైకుంఠ‌ము. అంటే నాశ‌న‌ము లేనిద‌ని అర్థం. అక్క‌డ కొలువుదీరిన‌వాడే నారాయ‌ణుడు. అందుకే స‌క‌ల దేవ‌త‌లు ఆ వైకుంఠ వాసుణ్ని ఆశ్ర‌యిస్తారు. ముక్కోటి ఏకాద‌శి రోజున ఆయ‌న చ‌ల్లని చూపు కోసం వేచి చూస్తారు. ప్ర‌తి నెలా 2 ఏకాద‌శులు క‌లిపి ఏడాదిలో మొత్తం 24 వ‌స్తాయి. వాటిలో వైకుంఠ ఏకాద‌శి … నారాయ‌ణుడికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌దిగా చెప్తారు. ఆ రోజున భ‌క్తులు వేకువ‌జామునే లేచి బ్ర‌హ్మ‌ ముహూర్తంలో త‌ల‌స్నాన‌మాచ‌రిస్తారు. వైష్ణ‌వాల‌యాల‌కు త‌ర‌లివెళ్తారు. అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో స్వామికి పూజ‌లు చేస్తారు. ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నం చేసుకుంటారు. ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచ‌రిస్తారు.

ఏకాద‌శి రోజున ఉప‌వాసం ఉంటే శుభం క‌లుగుతుంద‌ని విశ్వ‌సిస్తారు. ఉప అంటే ద‌గ్గ‌ర‌గా .. వాసం అంటే ఉండ‌టం. అంటే కేవ‌లం ఆహారం తీసుకోకుండా ఉండ‌టం మాత్ర‌మే కాదు … భ‌గ‌వంతుణిపై మ‌న‌సును పూర్తిగా ల‌గ్నం చేయ‌డం అని భావించాలి. అది పూజైనా కావొచ్చు లేదా జ‌పం, ధ్యాన‌మైనా చేయొచ్చు. మ‌నిషికి మొత్తం 11 ఇంద్రియాలు ఉంటాయి. అందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 క‌ర్మేంద్రియాలు, ఒక అంత‌రింద్రియం. ఉప‌వాసం వ‌ల్ల ఈ ప‌ద‌కొండు ఇంద్రియాల‌పై నియంత్ర‌ణ క‌లుగుతుంది. ఇదే ఏకాద‌శి ఉప‌వాసంలో అంత‌ర్లీనంగా దాగున్న విశేషం.

ముక్కోటి ఏకాద‌శి రోజున వైష్ణ‌వ దివ్య‌క్షేత్రాలు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడ‌తాయి. ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌ల‌తో స‌రికొత్త శోభ‌ను సంత‌రించుకుంటాయి. పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలతో ఆధ్మాత్మిక ప‌రిమ‌ళాల‌ను వెద‌జ‌ల్లుతాయి. ఇవ‌న్నీ భ‌క్తుల‌ను త‌న్మ‌య‌త్వంలో ముంచెత్తుతాయి.

– పి. వంశీకృష్ణ

For More Interesting Topics – బ్లూ బుక్ రూల్స్ అంటే ఏంటో తెలుసా..?